Malaysia: మలేసియాలో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృత్యువాత.. వీడియో ఇదిగో

  • నేవీ హెలికాప్టర్ల రిహార్సల్‌లో దుర్ఘటన
  • ప్రమాదవశాత్తూ గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు
  • రెండింటిలోని మొత్తం సిబ్బంది కన్నుమూత
  • మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘటన
Malaysian navy helicopters collide mid air and all 10 crew members dead

మలేసియాలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. రాయల్ మలేషియన్ నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు ప్రమాదవశాత్తూ గాల్లో ఢీకొట్టుకున్నాయి. రిహార్సల్‌ చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మృత్యువాతపడ్డారని మలేసియా నేవీ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ రాష్ట్రం పెరాక్‌లోని లుముట్ నౌకాదళ స్థావరం వద్ద ఈ ప్రమాదం జరిగిందని, మంగళవారం ఉదయం 9.32 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించింది. రెండు హెలికాప్టర్లలోని మొత్తం 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. అందరూ అక్కడికక్కడే చనిపోయినట్లు నిర్ధారించింది.

ఈ ప్రమాదంలో అగస్టావెస్ట్‌ల్యాండ్ ఏడ్ల్యూ139 మెరిటైమ్ ఆపరేషన్ హెలికాప్టర్, యూరోకాప్టర్ ఫెన్నెక్ లైట్-సైజ్ కౌంటర్ హెలికాప్టర్లు ఢీకొన్నాయని స్థానిక మీడియా ‘మలయ్ మెయిల్’ కథనం పేర్కొంది. గాల్లో ఢీకొన్నాక ఏడ్ల్యూ139 హెలికాప్టర్ నేవీ బేస్‌కు చెందిన స్టేడియం మెట్లపై పడింది. మరో హెలికాప్టర్ అదే బేస్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో పడిందని తెలిపింది. ఈ ఘటనపై మలేసియన్ నేవీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు ప్రక్రియ, మృతుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వీడియోలను షేర్ చేయవద్దని అక్కడి ప్రజలను ప్రభుత్వం కోరింది.

More Telugu News